Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ఇక కూటమి సమరభేరి

ఇక కూటమి సమరభేరి
మూడు పార్టీల నేతల కీలక భేటీ
“అనంత” పార్లమెంట్ సహా,  ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహం
టిడిపి, బిజెపి, జనసేన  సమిష్టి నిర్ణయం.


అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08:మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి నేతల కీలక భేటీ సోమవారం అనంతపురంలో జరిగింది. అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థులు, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి, బిజెపి జనసేన పార్లమెంటు స్థాయి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.అనంతపురం పార్లమెంటు స్థానంతో సహా,  ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా నాయకులు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎస్.ఆర్ గ్రాండ్ హోటల్ లో సుమారు గంటన్నరకు పైగా ఈ కీలక సమావేశం సాగింది.

అనంతపురం పార్లమెంటు పరిధిలో మూడు పార్టీల నేతల సమన్వయం  చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోవాలని కూటమి నేతలు నిర్ణయించారు. కూటమి నేతల తొలి సమావేశం దిగ్విజయంగా సాగింది. సమావేశంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాయదుర్గం కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్, కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, బిజెపి నేతలు సందిరెడ్డి శ్రీనివాసులు, జనసేన పార్లమెంటు అధ్యక్షుడు టి .సి వరుణ్ తదితర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, బిజెపి నేత సంధి రెడ్డి శ్రీనివాసులు, జనసేన నేత టిసి వరుణ్ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించే దిశగా సమన్వయంతో పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించారు. అడ్డగోలు దోపిడీ ద్వారా వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని నేతలు దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే దిశ దశ చూపగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని పేర్కొన్నారు. కూటమి పార్టీలలో ఒక పార్టీ ఎక్కువ, మరో పార్టీ తక్కువనే భావన లేదన్నారు.రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం లేకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు

. కేవలం ఆ రెండు అంశాల పేరిట రెండున్నర లక్షల కోట్ల రూపాయల మాత్రమే ఖర్చు పెట్టానని ముఖ్యమంత్రి చెబుతున్నారని మిగిలిన 10 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్లాయో చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రజలు కూటమి నేతలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 160 అసెంబ్లీ స్థానాలను, 23 పార్లమెంటు స్థానాలను కూటమి గెలుచుకోబోతోందని వారు జోష్యం చెప్పారు. వైసిపి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దింపాలని ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.

Related posts

Leave a Comment