Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

‘కోట’ అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే: టీడీపీ సీనియర్ నేత మద్దాలి సర్వోత్తమ రెడ్డి

టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులు కాదు అభివృద్ధి సాధకులు…

వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలకు దక్కని సంక్షేమ ఫలాలు… : మైనారిటీ నేత జలీల్ అహ్మద్

కోట పట్టణంలో సుమారు 18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది.. పేదలకు కేటాయించండి : షంషుద్దీన్.

నెల్లూరు-కోట, జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08: తిరుపతి జిల్లా కోట మండలం, కోట గ్రామంలో జరిగిన అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా కోటలోని ఆయన స్వగృహంలో శనివారం టీడీపీ సర్వ సభ్యసమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి వాటి కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించారు. కోట మండలంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం జరగాల్సిన గ్రామాల్లో త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. కోట గ్రామానికి చెందిన దివంగత మహనీయులు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు టీడీపీ ప్రభుత్వంలో నాయకులుగా ఉన్న సమయంలోనే కోట మండలంలో జరిగిందని గుర్తు చేసారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ హయాంలో కోట మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులు కారని అభివృద్ధి సాధకులు అని స్పష్టం చేశారు.తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యావత్ ముస్లిం సమాజాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందిని, నాలుగేళ్లుగా ముస్లింలకు అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని అన్నారు. తెలుగుదేశం హయాంలో అమలైన రంజాన్ తోఫా సహా వివిధ పథకాల అమలును నిలిపివేశారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు, స్వయం ఉపాధి రుణాలు, కడపలో హజ్ భవనం నిర్మాణం సహా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించారు. అందరికీ వర్తించే నవరత్నాలు మాత్రమే ముస్లింలకూ ఇస్తూ సరిపెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ షాదీ తోఫా, విదేశీ విద్యాదీవెన పథకాల్లో నిబంధనలు సడలింపుపై ముస్లింల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో పేద ముస్లింలు క్షోభకు గురవుతున్నారని అన్నారు. రెండు సంవత్సరాల పాటు కరోనా విలయతాండవంతో అన్ని వర్గాల వారితో పాటు ముస్లింలు ఆర్ధికంగా చితికిపోయారని, ఇప్పుడు షాదీ తోఫా నిబంధనలతో అనర్హులవడమే కాకుండా, పెళ్లిళ్లు చేసేందుకు అప్పులు పాలవుతున్నారని అన్నారు. అలాగే రంజాన్ తోఫా రద్దుతో పండుగ రోజు పొయ్యి కూడా వెలిగించలేకున్నారని, ఈ చివరి సంవత్సరమైనా పేద ముస్లింల కోసం రంజాన్ తోఫా అందించి ఊరట కలిగించాలని కోరారు.కోట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ.. కోట పట్టణంలో సుమారు 18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని తాను స్వయంగా ఎంపీటీసీ హోదాలో సర్వే నెంబర్లతో సహా స్పందనలో గూడూరు ఆర్డీఓ, కోట తహసీల్దార్లకు స్పందన ద్వారా అర్జీ ఇచ్చానని నేటికీ పట్టించుకోలేదన్నారు. కోట పంచాయతీలో వెయ్యికి పైగా నిరుద్యోగులండగా, పక్క పంచాయతీకి చెందిన ఓ యువకుడిని పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఎంపిక చేయడంలో మర్మమేంటో చెప్పాలని అడిగారు.. కోట గాంధీ బొమ్మ వద్ద మోకాళ్ళ లోతు నీళ్లు నిలవడానికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా..? అని ప్రశ్నించారు. పంచాయతీ సమస్య పరిష్కరించాల్సిన సమస్యలను టీడీపీకి అంటగట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.ఈ కార్యక్రమంలో.. టీడీపీ నాయకులు కందలి బాలకృష్ణ, తీగల సురేష్ బాబు, నెల్లూరు మొహన్ రెడ్డి, చంద్రశేఖర్, కోకొర్ల మధు యాదవ్, మస్తాన్ బాష, దారా సురేష్, పల్లెమల్లు వెంకట కృష్ణయ్య, మురళి, అనూక్, షేక్ బాబు, షేక్ నౌషాద్, సుహాసిని, మర్రి అనిల్, పోలమ్మ, చిట్టిబాబు, నందం మొహన్, తల్లం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment