మేడాపురం సూరి ఎవరు..? కేతిరెడ్డి నీ ఆత్మ కాదా
ఎందుకు నీ అక్రమాలను నువ్వే బయట పెట్టుకుంటావ్
ఛీఫ్ పాలిటిక్స్ గురించి నువ్వు మాట్లాడటమా
లోకేష్ కు జగన్ లాగా ముద్దులు పెట్టడం, బుగ్గలు నిమరడం రాదు
పరిటాల రవి గురించి చెడుగా తలుచుకుంటే నీ పతనం తప్పదు
అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నారా లోకేష్ తో పాటు తన పై చేసిన వ్యాఖ్యల మీద ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. గూగుల్ మ్యాప్ తీసుకొని వచ్చి తానేదో నిజాయితీపరుడు అన్నట్టుగా కేతిరెడ్డి మాట్లాడుతున్నారని.. ఎర్రగుట్టలో నీ ఫామ్ హోస్ చుట్టూ ఉన్న స్థలం ఎవరిది అని ప్రశ్నించారు. ఆ స్థలం జి సూర్యనారాయణ అలియాస్ మేడాపురం సూరి ది అని నువ్వే స్పష్టంగా చెబుతున్నావని శ్రీరామ్ అన్నారు. మేడాపురం సూరి అంటే కేతిరెడ్డి ఆత్మ అని ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు.
ఇలాంటి పేర్లన్నీ నువ్వే బయటకు తీసి నీ అక్రమాలను నువ్వే బయట పెట్టుకుంటున్నావన్నారు. నా పేరు చెప్పి భూ ఆక్రమణలు చేస్తే చెప్పుతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి ముందు ఆక్రమణలకు పాల్పడిన అనుచరులను నువ్వే కొట్టాలని సూచించారు. ఆ తర్వాత ప్రజలు వారిని ఎలా కొట్టాలో నిర్ణయిస్తారన్నారు. ఛీఫ్ పాలిటిక్స్ చేయవద్దంటూ, ఎమ్మెల్యే కేతిరెడ్డి నారా లోకేష్ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసునన్నారు. రాయలసీమ ప్రాంతంలో రైతుల సమస్యల గురించి నారా లోకేష్ నేరుగా తెలుసుకుంటున్నారని వారితో చాలా సమావేశాలు ఇప్పటికే నిర్వహించారని శ్రీరామ్ అన్నారు. ఇవన్నీ కేతిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. పాదయాత్ర అంటే సీఎం జగన్ లా ముద్దులు పెట్టడం బుగ్గలు నిమరడం వంటివి లోకేష్ కు చేత కాదని.. ఆయన ఉన్న వాస్తవాలను తెలుసుకుంటున్నారని ఎవరైనా అవాస్తవాలు చెప్పిన ఆయన వినరని శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ పేరు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ వాడుకుంటారని అలాంటిది నారా లోకేష్ ఆయన తన తాత అని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారంటే కేతిరెడ్డి స్థాయి ఏంటో అర్థమవుతోందని శ్రీరామ్ వ్యాఖ్యానించారు. మరోవైపు తన గురించి మాట్లాడేటప్పుడు కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి వచ్చారా అని నిత్యం వేలాదిమందికి అన్నదానం చేస్తున్న ఒక గొప్ప క్షేత్రం గురించి కామెడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమంతా పరిటాల రవి ఆశ్రమం నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకుంటామని అక్కడ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అండ దొరుకుతుందని శ్రీరామ్ అన్నారు. పరిటాల రవి ఆశ్రమం ద్వారా వందలాదిమందికి ఉచిత వివాహాలు చేశారని..
ఉచితంగా వందలాది వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. పరిటాల రవి పేరు పదే పదే కేతిరెడ్డి తలుచుకుంటున్నారని ఆయన గురించి మంచిగా తలుచుకుంటే ఆశీర్వాదం ఉంటుందని లేదా చెడుగా తలుచుకుంటే ఎక్కడికి పోతావో ఒకసారి ఆలోచించుకో అంటూ హితవు పలికారు. మరోవైపు అనంతపురం రాప్తాడులో తాము భూ అక్రమాలు చేశామంటూ కేతిరెడ్డి ఆరోపణలు చేశారని.. అక్కడ ఏ రాయిని కదిలించిన మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులే కనిపిస్తారని శ్రీ రామ్ అన్నారు. ఇప్పటికే తమపై ఇలా ఆరోపణలు చేసే వారు ముగ్గురు ఉన్నారని.. ఇప్పుడు నాలుగో వ్యక్తి నువ్వు వచ్చావని కానీ నాలుగేళ్లుగా మీరు నిరూపించింది ఏమీ లేదని శ్రీరామ్ అన్నారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకొని ఛీఫ్ పాలిటిక్స్ మానుకోవాలని కేతిరెడ్డికి శ్రీరామ్ సూచించారు.