Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడ

ష్యురిటీ ఉంటేనే కొలువు… లేదంటే సెలవు…

 ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులకు సరికొత్త కష్టాలు…

నిబంధనల పేరుతో ఉద్యోగులతో ఏజెన్సీల చెలగాటం…

ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఏజెన్సీల వ్యవహారం…

ప్రభుత్వం చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని ఉద్యోగుల వేడుకోలు…

యు. కొత్తపల్లి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 8: వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వ దుకాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2934 షాపుల నిర్వహణకు 12 వేలకు పైగా యువకులను ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకున్నారు.. సేల్స్ మెన్ కు ఇంటర్ అర్హత కాగా, సూపర్వైజర్ పోస్టుకు డిగ్రీ అర్హత పెట్టారు. ఉద్యోగాలు లేకపోవడం, చదువు పూర్తయి ఖాళీగా ఉండటంతో చాలా మంది యువకులు బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలుగా అయినా సరే పని చేసేందుకు ముందుకు వచ్చారు. మొదట్లో పెద్దగా నిబంధనలు ఏమీ పెట్టలేదు..అయితే రాను రాను ఈ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుదీస్తూ వస్తున్నారు. షాప్ టైమింగ్స్ పెంచినా, జీతం పెరుగుదల లేకపోయినా యువకులు పని పనిచేస్తున్నారు .కొవిడ్ లో సైతం ధైర్యంగా విధులు నిర్వహించారు. డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిళ్లు ఉన్నా, పని ఎక్కువుగా ఉన్నా బ్రతుకు బండి లాగిస్తున్నారు.

ష్యురిటీ ఉంటేనే ఉద్యోగం…

ఇటీవల కొత్తగా తీసుకు వచ్చిన ఒక నిబంధన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వందలాది మంది యువకుల నెత్తిన పిడుగు పడినంత పని చేసింది..ఉద్యోగం ఉండాలంటే రూ.3 లక్షలకు , ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల చేత పూచీకత్తు సంతకాలు తీసుకు రావాలంట..అంతే కాకుండా సదరు ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు, పే స్లిప్పులు కూడా ఇవ్వాలంట. ఇవన్నీ సమర్పిస్తేనే ఉద్యోగమట.. ఈ నిబంధనతో వందలాది మంది యువకులు కంగుతిన్నారు. సాధారణంగా ఒక సర్టిఫికేట్ మీద గెజిటెడ్ సంతకం చేయమంటేనే ఉద్యోగులు భయపడి పోతారు. అలాంటిది ముక్కు మొహం తెలియని వ్యక్తికి సంతకం, ఐడీ కార్డు, పే స్లిప్పులు ఎలా ఇస్తారు అని మద్యం దుకాణాలలో పనిచేసే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు . ఉద్యోగంలో చేరినప్పుడు లేని నిభందనలు ఏజెన్సీ మారగానే ఎలా విధిస్తారు అని, అసలు ఉద్యోగం ఉంచడానికా, తీసేయడానికా ఇలాంటి నిబంధనలు అని మద్యం దుకాణాల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల ఆదాయం తీసుకువస్తున్న మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిని ఈ రకంగా వేధించడం దారుణమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆదాయానికి కారకులైన సిబ్బందిని ఇలా నిబంధనల పేరిట వేధించడం సరి కాదని అంటున్నారు.

ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఏజెన్సీల వ్యవహారం…

వాస్తవానికి ఈ ఉద్యోగాలలో చేరిన యువకులలో, ఏదోరకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిఫార్సులు చేసినవారే అధికం. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ మద్యం దుకాణాలలో తమ అనూయాయులకు, అవకాశాలు కల్పించేందుకు పైరవీలు గట్టిగానే జరిగాయి. మొత్తానికి ఈ విషయంలో పార్టీ విధేయుల పంతం నెగ్గించుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తలను కాదని ఇటీవల కాలంలో నేతలు కొత్తవారిని చేరదీసారు. ప్రతి నియోజకవర్గం లోనూ ఈ తంతు జరిగింది…ఇక్కడే వచ్చింది అసలు చిచ్చు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్యకర్తలకు, నిజంగా పార్టీ విజయానికి కృషి చేసిన వారికి బేధాభిప్రాయాలు సహజంగానే ఏర్పడ్డాయి అనేది పలువురి వాదన. ఇప్పుడు మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పొగబెట్టి, పక్కకు తప్పించి తమ వారికి స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతో కొత్తగా పార్టీల్లోకి చేరిన కార్యకర్తలు ప్రయత్నిస్తిస్తున్నారనేది కొంతమంది వైసీపీ నాయకుల అభిప్రాయం. దీనికోసం ఎమ్మేల్యేలు, నియోజక వర్గ ఇంచార్జుల పై ఒత్తిడి పెంచి, వారితో ఏజెన్సీ లు ఈ నూతన నిబంధనలు అమలు చేయాలని సూచనలు చేయిస్తున్నారని తెలుస్తుంది.మరి కొత్తగా వచ్చేవారికయినా ఈ ష్యురిటీ గోల తప్పదు కదా అనుకోవచ్చు… కానీ కొత్త గా పార్టిలోకి చేరిన వారి హవా నడుస్తోంది కాబట్టి , వారి అనుచరులకు ఎదో రూపంలో ఏర్పాట్లు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఏజెన్సీల కూడా ఈ అంశాన్ని అవకాశంగా మలచుకొని ష్యూరిటీ రూపంలో సొమ్ము చేసుకోవాలని నిర్ణయంచుకున్నారని, దీనితో ఉదోగులను కట్టిపడేసే విధంగా పథకం రూపొందించినట్లయిందనీ బాధిత వైసీపీ కార్యకర్తలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.. ఒకవేళ హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులను తొలగిస్తే ప్రభుత్వానికి పెద్ద దెబ్బేనని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో గతంలో ఉన్న ఒక ఏజెన్సీ సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధించిందనీ, అది పోయింది అనుకుంటే కొత్తగా వచ్చిన ఏజెన్సీ ఏకంగా ఉద్యోగాలకే టెండర్ పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటోందనీ మద్యం దుకాణాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఏదో ఒక ఉద్యోగం కదా అని నెట్టుకు వస్తున్న వేలాది మంది యువకులను రోడ్డున పడేసే ఇలాంటి నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి,ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు వైన్ షాపులో పనిచేసే ఉద్యోగులు కోరుతున్నారు..

Related posts

Leave a Comment