పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పలు సివిల్ సప్లయిస్ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించి వారి పరిధిలోని ఎఫ్ పి షాపులు, ఎండియు వాహనాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్, సిలిండర్ గోడౌన్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. తనిఖీలకు సంబంధించిన రిపోర్ట్ లను ప్రొఫార్మా ప్రకారం ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అందించాలన్నారు. ఏ పాఠశాలను, ఏ అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు అనేది పూర్తి వివరాలతో అందజేయాలన్నారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు నిర్వహించి పాఠశాలలో, అంగన్వాడి కేంద్రాలలో అన్ని విషయాలను గమనించాలని, రాగి జావా సక్రమంగా ఇస్తున్నారా, టేక్ హోమ్ రేషన్ సివిల్ సప్లై శాఖ నుంచి అన్ని సరిగా వెళ్తున్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. పాఠశాలలకు సరఫరా చేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ ను ఎలా వండాలో తెలియజేయాలని, ముందుగా ఈ విషయమై సిఎస్డిటిలకు అవగాహన ఉండాలని, ఫోర్టిఫైడ్ రైస్ ను వండడంలో జాగ్రత్తలు తెలియజేయాలని, ఫోర్టిఫైడ్ రైస్ ను వండడంపై వీడియోలు తయారు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఎండియు వాహన ఆపరేటర్ల ఖాళీలను నియమించేందుకు తగినచర్యలుతీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులను కార్డుదారుల వద్దకు వెళ్లి అందించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఓ సింధు, డిఎంఓ అశ్వర్థ నారాయణ నాయక్, సిఎస్డిటిలు పాల్గొన్నారు.