మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్…
రాయదుర్గం, జనసేన ప్రతినిధి డిసెంబర్ 03:
రాయదుర్గం నియోజకవర్గంలో మిరప రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన బొమ్మనహల్ మండలం, గోవిందవాడ గ్రామంలో దెబ్బతిన్న మిర్చి పంటను టిడిపి నాయకులు, రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సాధారణ పంటల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ మిర్చి పంటకు పెట్టుబడులు అవసరమన్నారు. పంట పూర్తిగా దెబ్బ తినడం వల్ల సగటు రైతు తీవ్రంగా నష్టపోయాడన్నారు.
సర్మస్ అనే రైతు రెండెకరాలను గుత్తకు తీసుకుని పంట పెట్టి తీవ్రంగా నష్టపోయానని కాలవతో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దెబ్బతిన్న పంటను వెంటనే అధికారులు రికార్డుల్లో నమోదు చేసి, పరిహారం అందించారని కాలవ ఈసందర్భంగా గుర్తు చేశారు. మరోసారి పంటలు పెట్టుకోడానికి పెట్టుబడుల రూపంలో సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమని రైతులు తెలిపారు. గోవిందవాడ, కల్లుహోల్ల, కల్లుదేవనహల్లి గ్రామాల్లో దాదాపు మూడువేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
దెబ్బతిన్న మిరప పంటను తక్షణమే అంచనా వేసి, రైతులకు పరిహారం అందించాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బలరామి రెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు కొత్తపల్లి మల్లికార్జున, సోము, మాజీ జెడ్పీటీసీ కుమ్మరి మల్లికార్జున, ఎస్.జి. వన్నురుస్వామి, మాజీ సర్పంచ్ దేవేంద్రప్ప, అప్పారావ్, కొత్తపల్లి మహేంద్ర, శినా, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.