Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

బీసీల ద్రోహి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పండి

  • బీసీల ద్రోహి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పండి.
  • ఈ ఐదేళ్లలో బీసీలు అనుభవించిన కష్టాలు వర్ణణాతీతం
  • తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం.
  • టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది లేదు.
  • జయహో బీసీ సభల్లో మాజీ మంత్రి పరిటాల సునీత
  • చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో ఘనంగా జయహో బీసీ సభలు

రాప్తాడు జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కాదని.. ఇప్పుడు ఆ పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో జయహో బీసీ సభలు అట్టహాసంగా సాగాయి. ఉదయం చెన్నే కొత్తపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బీసీలు ర్యాలీ నిర్వహించారు.

హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు రంగయ్య ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. సాయంత్రం అనంతపురం రూరల్ మండల పరిధిలోని సిండికేట్ నగర్ లో జయహో బీసీ సభ నిర్వహించారు. ముందుగా ఇక్కడ కూడా మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ సభ జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ మొదటి నుంచి బీసీల పక్షపాతిగా పరిటాల రవి పేరు తెచ్చుకున్నారన్నారు. బీసీలకు ఏ కష్టం వచ్చినా ఆయన ముందు ఉండేవారన్నారు.

చాలా ప్రాంతాల్లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పరిటాల రవి అండగా నిలిచి వారికి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని సునీత అన్నారు. ఆరోజు బీసీలకు రుణాలు ఇచ్చినా, కుల వృత్తుల వారికి పనిముట్లు ఇచ్చినా అది ఒక తెలుగుదేశంకే సాధ్యమైందన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ రోజు జగన్ చెప్పిన మాటలు విని కొంతమంది ఓట్లు వేసినందుకు చాలా బాధపడుతున్నారని అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అన్ని రంగాల వారు మరీ ముఖ్యంగా బీసీలు ఆధారపడ్డ అన్ని పనులు దెబ్బతిన్నాయని సునీత అన్నారు. ఇక రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుల వలన అనేకమంది బీసీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెన్నేకొత్తపల్లిలోని శివారెడ్డి డాబాలో ఎమ్మెల్యే సోదరుడు సెటిల్మెంట్లు చేస్తూ ఎంతో మంది బీసీలకు అన్యాయం చేశారన్నారు. బీసీల నుంచి భూములు లాక్కోవడం వారి ఆస్తులు లాక్కోవడం వంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేశారన్నారు. వారికి ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. కొందరు అధికారులు కూడా వారికి వంత పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే సోదరులు చెప్పినట్లు చాలామందికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఎస్ఐలు, సిఐలు కూడా వారికి కొమ్ము కాసి అమాయకులను ఇబ్బంది పెట్టారన్నారు. ఇలాంటి వారిని కచ్చితంగా తాము గుర్తుపెట్టుకుంటామన్నారు. వారు ఎక్కడికి వెళ్లినా తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల వలన పేరూరు డ్యామ్ కు నీరు రాకుండా పోయిందన్నారు. ఆరోజు తాము 804 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయిస్తే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. మరోవైపు జాకీ పరిశ్రమ కూడా వీరి బెదిరింపుల కారణంగా వెళ్లిపోయిందన్నారు. అలాగే పరిశ్రమలు తీసుకొస్తామని పేదలకు ఇల్లు నిర్మిస్తామని మోసం చేసిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి అంటూ విమర్శించారు. ఇందులో నష్టపోయింది అత్యధికలు బీసీ లేనని సునీత అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ముఖ్యంగా బీసీలకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు తీసుకొస్తామని సునీత హామీ ఇచ్చారు. మరోవైపు టిడిపి ఇటీవల ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోకు సంబంధించిన పథకాల గురించి కూడా వివరించారు.

బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకొస్తామని సునీత అన్నారు. ఎన్నికలకు ఇక ఎన్నో రోజులు లేవని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో బాధింపబడ్డ బీసీలంతా గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని సునీత అన్నారు. ఎన్నికలవరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆ తర్వాత ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు.

Related posts

Leave a Comment