ధర్మవరం ఫిబ్రవరి 08 జనసేన బ్యూరో: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నేటి సమాజంలో గుండె నొప్పితో బాధపడుతూ, గుండెపోటుతో చాలామంది మృతి చెందుతున్నారు. ఇటువంటి సమయంలో నేటి ప్రభుత్వం పేదల గుండెకు భరోసాగా, 45 వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ వేయించి, ప్రాణాల నుండి కాపాడటం జరుగుతోందని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ గుండెపోటు అనేది అధికంగా బీపీ, షుగర్ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చాతి నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మికంగా ఆయాసం రావడం, గుండె దడ రావడం, స్పృహ కోల్పోవడం లాంటివి గుండెపోటు లక్షణాలు అని తెలిపారు.
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెనువెంటనే మొదటి గంటలోపు తాము ఇచ్చే వైద్య చికిత్సలతో పాటు ఇంజక్షన్ వేయించుకున్నప్పుడు పూర్తి దశలో ప్రాణము నుండి కాపాడగలమని వారు తెలిపారు. ప్రభుత్వమే 45 వేల రూపాయలు విలువచేసే ఇంజక్షన్ పేద ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. స్టెమి గుండెకు భరోసాగా ఉంటుందని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నవారు మొదటి గంటలోనే అత్యంత కీలకంగా భావించి వెంటనే ప్రాణాలను కాపాడుకోవడానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. గుండెపోటు వచ్చిన గంటలోపే టెనెట్ ప్లేస్ అనే ఇంజక్షన్ తో ప్రాణాలను రక్షించే అవకాశం ఉందని తెలిపారు.
పేదల కోసమే ప్రభుత్వం ఇటువంటి సేవలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు మా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్షలను నిర్వహించి మొదటి గంటలోనే టెనెట్ ప్లేస్ అనే ఇంజక్షన్ ను 24 మంది రోగులకు ఇచ్చి ప్రాణాలను కాపాడడం జరిగిందని తెలిపారు. వీటిపై ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ప్రతిరోజు అవగాహన చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు పూర్తిగా ఉచితమని తెలిపారు. గుండెకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తో పాటు గుండెపోటు భవిష్యత్తులో రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.