ముదిగుబ్బ ( జనసేన ప్రతినిధి ) ఫిబ్రవరి 9: ముదిగుబ్బ మండలంలోని మద్దిలేరు ప్రాజెక్టు కాలువలకు గండ్లు పడటంతో ప్రాజెక్టు సాగునీరు ఏటిపాలవుతోంది. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువకు భారీగా గండ్లు పడి, విడుదలైన నీరు నిరర్థకంగా పోతుండడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా పూర్తి కాకపోయిన కాలువల మరమ్మతులను పక్కన పెట్టి, అధికార పార్టీ నాయకులు నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.నాలుగు రోజుల క్రితమే నీటిని విడుదల చేసినప్పటికీ, కాలువలో ఏర్పడిన భంగం కారణంగా సాగునీరు వేగంగా ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితి పశ్చిమ ప్రాంతాల్లోని పంట పొలాలకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే చాలాచోట్ల నీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తక్షణచర్యలు అవరం ప్రస్తుతం పారుతున్న ఎడమ కాలువలో గండ్లు పూడ్చి, నీటి వృథా ఆపడం అత్యవసరం. అదే విధంగా, ఇంకా పూర్తి కాకుండా ఉన్న కుడి కాలువ మరమ్మతులను త్వరగా ముగించి, ఆ కాలువ ద్వారా కూడా నీటిని విడుదల చేయాలి. అప్పుడు మాత్రమే మద్దిలేరు ప్రాజెక్టు పరిధిలోని అన్నీ పొలాలకు నీరు అందనుంది.ఈ సమస్యను అధికార యంత్రాంగం వెంటనే పరిష్కరించి, రైతుల కష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని రైతుల ఆందోళనను సమర్థించాలంటే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.