పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన
మండల వ్యవసాయ అధికారి…
క్రోసూరురూరల్,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి….
తేది.12-02-2025 న మండలంలోని గుడిపాడు,88 తాళ్లూరు గ్రామాల్లో
*”పొలం పిలుస్తోంది”* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ రబీ సీజన్ లో మండలంలో రైతులు వరి, శనగ, మొక్కజొన్న, పొగాకు మొదలగు పంటలను సాగు చేయడం జరిగింది. ఈ పంటలను ఈ-పంట యాప్ ద్వారా రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చేయడం జరుగుతున్నది. ఈ-పంట నమోదుకు ఈనెల 15 వ తేదీ ఆఖరు తేదీ గా ఉన్నది. కనుక, పంటలు వేసిన రైతులు రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి వారు వేసిన పంటలు ఈ-పంట యాప్ లో నమోదై ఉన్నవో? లేవో? సరి చూసుకోవలెను. ఒకవేళ నమోదు కానట్లుగా గుర్తించినట్లయితే వెంటనే నమోదు కొరకు రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించవలెను.ఈ సంవత్సరం నుండి వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలను పారదర్శకంగా మరియు సులభతరంగా చేయడం కోసం వెబ్ ల్యాండ్ లో పొలం కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకు *”ప్రత్యేక గుర్తింపు సంఖ్య”* ను ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ సంఖ్య కలిగిన రైతులకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల లబ్ది చేకూరుతుందని తెలియజేశారు. కావున, రైతులందరూ వారి యొక్క గ్రామాలలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందవలసిందిగా తెలియజేశారు.ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందుటకు రైతు ఈ క్రింద తెలిపిన పత్రాలతో రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించవలసి ఉంటుంది.”
అవి…….
1.పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ (లేదా) అడంగల్ కాపీ.
2.ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ.
3.ఆధార్ నంబర్ కు లింకు అయిన ఫోను.ప్రత్యేక గుర్తింపు సంఖ్య మంజూరు కొరకు రైతు యొక్క ఆధార్ నంబర్ నకు లింకు అయిన ఫోన్ నకు 3సార్లు ఓటీపీ వస్తుంది. కనుక, రైతులు వారి యొక్క ఆధార్ నెంబర్ కు లింకు అయిన ఫోన్ ను తప్పకుండా రైతు సేవా కేంద్ర కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పకుండా వారి వెంట తీసుకొని వెళ్ళవలెను. ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందుటకు ప్రభుత్వం ఈనెల చివరి దాకా గడువు గా నిర్ణయించింది. కనుక, రైతులు వీలైనంత త్వరగా రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందే విషయంలో వ్యవసాయ శాఖకు సహకరించవలసిందిగా కోరడమైనది.
తదుపరి, మండల వ్యవసాయ అధికారి గారు గ్రామంలో సాగులో ఉన్న మొక్కజొన్న పంటను రైతులతో కలిసి పరిశీలించి సస్యరక్షణ చర్యలు మరియు యాజమాన్య పద్ధతులు గురించి వివరించడం జరిగింది.
కార్యక్రమంలో ఆయా రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఖాజా మొయినుద్దీన్, ఆరిఫ్ మరియు రైతులు పాల్గొన్నారు…..