
భీమవరం: ఆచంటలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కోటి రూపాయలతో త్వరలో అత్యాధునిక పరికరాలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.
పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో శుక్రవారం బీజేపీ ఆచంట నియోజకవర్గ కన్వీనర్ కేహెచ్ వీ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఆచంట అసెంబ్లీ కార్యకర్తల సమావేశం జరిగింది.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దొంగరావిపాలెంలో రూ.20 లక్షలతో కమ్యూనిటీ హాల్, పోడూరులో రూ.40 లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.
సామాన్య కార్యకర్త కూడా కేంద్రమంత్రి, ప్రధాని అయ్యే అవకాశం బీజేపీలోనే ఉందన్నారు. రాజకీయాల్లో స్థానం సంపాదించాలనే తపన ప్రతి ఒక్కరిలో సహజమని, రాజకీయాల్లో ఒక లక్ష్యంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కీలకమైన పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్, హైవేల నిర్మాణానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని, కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నోసార్లు చెప్పారన్నారు. ప్రతి భాజపా కార్యకర్త కేంద్ర పథకాల గురించి తెలుసుకుని అర్హులైన వారందరికీ అందేలా కృషి చేయాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ఆలయ, మార్కెట్ యార్డు కమిటీల్లో భాజపా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి మండల భాజపా కార్యకర్తల సమావేశానికి తాను కూడా హాజరవుతానని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలు టీడీపీ, జనసేన పార్టీల సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాయకులుగా ఎదిగేందుకు ప్రతి కార్యకర్త కృషి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానన్నారు.
అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయి దుర్గారాజు, పులవర్తి వెంకటేశ్వరరావు, పెనుమంట్ర మండల అధ్యక్షుడు గోపరాజు మారుతీకృష్ణ, ఆచంట మండల అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, పెనుగొండ మండల నాయకుడు నాగూర్, పోడూరు మండల అధ్యక్షుడు చింతపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.