అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..
అగ్రరాజ్యం అమెరికా (America) లో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు నరరూప రాక్షసులు 20 ఏళ్ల యువకుడిని రహస్య ప్రదేశంలో బంధించి తీవ్రంగా హింసిస్తూ రాక్షసానందం పొందారు. అలా వారి పైశాచికత్వం 7నెలల పాటు కొనసాగింది.
చివరికి వారి పాపం పండడంతో పోలీసులకు చిక్కారు. ఈ ఘటనలో నిందితుడు , అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిస్సోరి రాష్ట్రంలో జరిగిన ఈ అమానుష ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెయింట్ లూయిస్ నగర పరిధిలోని డిఫాయెన్స్లోని ఓ రెస్టారెంట్లో ఓ స్థానికి వ్యక్తికి బాధిత యువకుడు అనుమానస్పదంగా కనిపించాడు. దాంతో ఆ వ్యక్తి వెళ్లి బాధిత యువకుడిని కలిశాడు. ఆ సమయంలో ఏదైనా సమస్య ఉంటే.. తనకు ఫోన్ చేయమని అతనికి తన ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లిపోయాడు. దాంతో ఆ వ్యక్తితో బాధితుడు వాట్సాప్ ద్వారా తనపై ఆ ముగ్గురు నరరూప రాక్షసులు చేస్తున్న పైశాచికత్వాన్ని తెలియజేశాడు. వారు తనను ప్రతిరోజు ఏ రకంగా వేధిస్తుంది వివరించాడు. బాధితుడి వివరణతో చలించిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. స్థానిక వ్యక్తి సమాచారంతో ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, పోలీసులను గృహంలోకి ప్రవేశించడాన్ని సత్తారు, అతని సహచరులు నిరాకరించారు. ఇది గమనించిన బాధితుడు తనంతటా తానే బయటకు పరుగెత్తుకొచ్చి పోలీసులతో తనను రక్షించాల్సిందిగా వేడుకున్నాడు. దాంతో ఆ ముగ్గురి అరాచకాలు బయటపడ్డాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 ఏప్రిల్ నుండి నవంబరు వరకు 7 నెలల పాటు బాధిత యువకుడిని సత్తారు వెంకటేష్ రెడ్డి, పెన్మత్స నిఖిల్, శ్రబన్ పెనుమచ్చలు తీవ్రంగా హింసించారు. ప్రతిరోజు పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో చావబాదేవారు. అలా బాధితుడిని చితకబాదుతూ, అతడు ఆ దెబ్బలు తాళలేక విలవిల్లాడుతుంటే చూసి ఆనందించేవారు ఆ ముగ్గురు. వారి రాక్షస చర్యకు బాధితుడి నుదుటి నుండి పాదాల వరకు శరీరంపై గాట్లు, గాయాలు అయ్యాయి. చివరికి పక్కటెముకలతో పాటు శరీరంలో పలుచోట్ల ఎముకలు కూడా విరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పని మొత్తం బాధిత యువకుడితోనే చేయించేవారట. అంతటితో ఆగకుండా ప్రధాని నిందితుడు వెంకటేష్ డైలీ 2గంటల పాటు మసాజ్ చేయించుకునేవాడట. వారు చెప్పిన పనులు చేయకపోతే తనను ఇంకా తీవ్రంగా హింసించేవారని బాధితుడు వాపోయాడు. ఇంటి బేస్మెంట్లో నేలమీద పడుకుబెట్టేవారట. అది కూడా కేవలం ఒకరోజులో 3గంటలు మాత్రమే నిద్రపోయేందుకు అనుమతించేవారని బాధితుడు పేర్కొన్నాడు.