Janasena News Paper
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

అంతర్గత పోరు కథనానికి తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం..

జనసేన పత్రికలో వచ్చిన బిజెపి పార్టీ లో బయటపడ్డ అంతర్గత పోరు కథనానికి తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం..

  • బిజెపి సీనియర్ నేత గోపాల్ రెడ్డి పై దాడికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..

అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 29

తంబళ్లపల్లి : జనసేన పత్రికలో వెలువడిన బిజెపి పార్టీ లో బయటపడ్డ అంతర్గత పోరు కథనానికి తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం దాడికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండలం చౌడ సముద్రం పంచాయతీ గంగిరెడ్డిపల్లి వద్ద గురువారం బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నేత గోపాల్ రెడ్డి పై జరిగిన దాడి కి సంబంధించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ములకలచెరువు ఎస్ఐ గాయత్రి జనసేన పత్రిక పాత్రికేయుడి తో పాటు మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ఈ మేరకు ఎస్ ఐ గాయత్రి కథనం మేరకు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ములకలచెరువు మండలంలోని చౌడ సముద్రం సమీపంలో గురువారం బిజెపి రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ జాయింట్ కన్వీనర్ బి గోపాల్ రెడ్డి తంబళ్లపల్లి మండలం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని కార్యక్రమం ముగియగానే సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో గోపాల్ రెడ్డి తన స్వగ్రామమైన బురకాయలకోట కు ద్విచక్ర వాహనంలో బయలుదేరి వెళుతుండగా మార్గమధ్యంలో చౌడసముద్రం వద్ద తిమ్మ శేఖర్, మహేశ్వర్ రెడ్డిలు అడ్డగించి దాడి చేసిన విషయం తెలిసిందేనన్నారు.

ఈ కేసులో నిందితులైన తిమ్మశేఖర్, మహేష్ రెడ్డి, మహమ్మద్ షరీఫ్, ప్రశాంత్ లను శుక్రవారం తంబళ్లపల్లి రోడ్డులోని పాత ములకలచెరువు బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా బిజెపి కార్యక్రమాల కు చెందిన సమాచారాన్ని శేఖర్ కు తెలపకపోవడంతో గోపాల్ రెడ్డి పై కక్ష పెంచుకున్నాడని ఇదే అదునుగా భావించిన శేఖర్ గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న మిత్ర బృందం గోపాల్ రెడ్డి పై దాడికి పాల్పడినట్లు నిందితులు నేరం అంగీకరించారని ఎస్ ఐ గాయత్రి తెలిపారు.

ఈ కేసులో నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గోపాల్ రెడ్డిని పలువురు బిజెపి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకొని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ధైర్యం చెప్పారు.

Related posts

Leave a Comment