ఒక చేతకాని దద్దమ్మ రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు
ఐదేళ్లు రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు
ఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు
ఈ ఐదేళ్లలో బాగుపడింది.. ఆ నలుగురు మాత్రమే
ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు.

రాప్తాడు జనసేన ప్రతినిధి ఏప్రిల్ 06:ఒక చేతకాని దద్దమ్మ రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారని మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామగిరి మండలంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిరోజు చెర్లోపల్లి, పాపిరెడ్డిపల్లి, పోలేపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామానికి వచ్చిన పరిటాల సునీతకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచార కార్యక్రమంలో ముందుకు సాగారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే ప్రస్తుతమున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. వీటన్నింటిని అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదే సమయంలో ఈ ఐదేళ్లలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించాలన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రామగిరి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు ఎప్పుడైనా మీ గ్రామం వైపు చూశారా అని ప్రశ్నించారు. కనీసం ఏదైనా సమస్య ఉందని ఇంటి వద్దకు వెళ్తే కూడా పలకరించే పరిస్థితుల్లో ఎమ్మెల్యే సోదరులు లేరని విమర్శలు చేశారు. పైగా రాప్తాడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తుంటే మేము అడ్డుకున్నామంటూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నది నువ్వా నేనా అంటూ సునీత నిలదీశారు.

తాను మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి 33 పనులు మంజూరయ్యాయని.. తాము కూడా పనులు మొదలుపెట్టామన్నారు. అయితే ఎమ్మెల్యే గా ప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు చేయకుండా అడ్డుకున్నారన్నారు. ఆ కాంట్రాక్టు మరొకరికి ఇప్పించారన్నారు. అయితే వారిని కూడా పనులు చేయనివ్వకుండా కమీషన్ల కోసం బెదిరించారన్నారు. పనులు పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పినా వినకపోవడంతో కాంట్రాక్టర్లు వెనక్కి వెళ్లిపోయారన్నారు. మీ కమీషన్ల దాహానికి రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఐదేళ్లపాటు కష్టాలు పడ్డారన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు మీరు చేసి.. మాపై విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎవరైనా బాగుపడ్డారంటే.. అది ఒక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు ఆయన తండ్రి మాత్రమే అని అన్నారు. ఏ రోజు ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా నిత్యం బెదిరింపులు, ఎర్ర మట్టి దోపిడీ, దౌర్జన్యాలు, రియల్ ఎస్టేట్లతోనే కాలం గడిపారన్నారు. చెన్నేకొత్తపల్లి సమీపంలోని డాబాలో కాపురం పెట్టి అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకున్నారన్నారు. ఇలాంటి పాలకులు మళ్లీ కావాలా అని సునీత ప్రజలను అడిగారు. ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.