24 గంటలలోపు పనులు పూర్తి కావాలి.
ఏ సమస్య అయినా, ఏ పనైనా 24 గంటల గడువులోపు పరిష్కరించాలి.
ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు 100 శాతం పనిచేయాలి
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి .

అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08:ఎన్నికలకు సంబంధించి అందించిన సూచనలు పాటించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు, ప్రతి పని పూర్తి చేసేందుకు 24 గంటల సమయాన్ని డెడ్ లైన్ గా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. ఆదివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల సన్నద్ధతపై నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమైనదని, ఆర్ఓలు 100 శాతం పనిచేయాలన్నారు. 24 గంటల గడువులోపు నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఇచ్చిన సూచనలను పూర్తి చేయాలన్నారు. సంబంధిత ఆర్ఓలకు జిల్లా అధికారులు అవసరమైన సమన్వయం, సహకారం అందించాలన్నారు. ఈ సమస్య వచ్చినా జడ్పి సీఈవో, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ అందుబాటులో ఉంటారని, సమస్యలను వారి దృష్టికి తీసుకుని వెళ్లి వెంటనే పరిష్కరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నోడల్ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో సీజర్స్ నమోదుపై నిఘా పెట్టాలని, ముఖ్యమైన మూమెంట్స్, సంఘటనలను గుర్తించాలని, వాహనాలు, ఇతర సీజర్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు చేయాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

క్షేత్రస్థాయి నుంచి సమాచార వ్యవస్థ బాగుండాలని, వీఆర్ఏ, వీఆర్వోలు, తహసిల్దారు రిపోర్టులు ఎప్పటికప్పుడు అందించాలని, ఎఫ్.ఎస్.టీ, ఎస్.ఎస్.టీ టీంలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. మద్యం, డ్రగ్స్ లాంటి సీజర్స్ కూడా నమోదు చేయాలని, అన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సీజర్స్ నమోదు చేసేలా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అన్ని శిక్షణా కార్యక్రమాల్లోనూ అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై నగర పాలక సంస్థ కమిషనర్ ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ లలో విద్యుత్, ఎలక్ట్రానిక్, ఇతర పనులు వేగవంతంగా చేపట్టాలని, పీఆర్, ఆర్అండ్బి ఎస్ఈలు మున్సిపల్ కమిషనర్ తో ఒక టీంగా పని చేయాలన్నారు.
నోడల్ అధికారులు వారికి ఇచ్చిన సూచనల ప్రకారం పనులను 24 గంటల్లోగా చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్ సౌకర్యం కల్పించడంలో భాగంగా జిల్లాలో మండలాల వారీగా ఎన్ని వీల్ చైర్స్ అందుబాటులో ఉన్నాయనేది గుర్తించాలని, ఎక్కడెక్కడ వీల్ చైర్స్ అవసరమవుతాయనేది ఆర్ఓలు గుర్తించాలని, అవసరమైతే అందుబాటులో ఉన్న నిధులతో కొనుగోలు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, తదితర 12 రకాల సదుపాయాల కల్పనపై రిపోర్టులను అందించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశాలకు రిటర్నింగ్ అధికారులు హాజరు కావాలన్నారు.
ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల రిపోర్టులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఏరోజుకారోజు పంపించాలని, ఇందుకోసం ఆర్ఓ స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలన్నారు. నియోజకవర్గాలు, మండలాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను మరింత బలోపేతం చేయాలని, ఎలాంటి సందేహం ఫోన్ చేసి అడిగినా పూర్తిగా సమాచారం అందించాలన్నారు.ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు జి.వెంకటేష్, రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, రాంభూపాల్ రెడ్డి, వెన్నెల శ్రీను, నోడల్ అధికారులు ప్రభాకర్ రావు, సురేంద్ర, ఓబుల్ రెడ్డి, వీర్రాజు, చౌదరి, మధుసూదన్, వరలక్ష్మి, అప్పాజీ, రఘునాథరెడ్డి, ఉమామహేశ్వరమ్మ, భాస్కర్, పి.గురుస్వామిశెట్టి, డా.ఈబి.దేవి, ఎన్ఐసి డిఐఓ రవిశంకర్, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, సివిల్ సప్లయ్ డిఎం రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.