ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు

వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు.
చివరి బాధితుడికి కూడా సాయం అందేలా చూస్తున్నామని స్పష్టం చేశారు.
వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను క్షేత్ర స్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం సాధ్యమైనన్నీ ఎక్కువ హెలికాప్టర్లు, డ్రోన్లు తెప్పిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 32 మంది ఐఏఎస్ అధికారులు ఫీల్డ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించామని పేర్కొన్నారు. బాధితుల దగ్గరికే ఆహార పదార్థాలు వస్తాయని చెప్పారు. సహాయక చర్యలు అందించడంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. క్రమశిక్షణతో బాధితులకు నిత్యవసరాలు అందించాలని అన్నారు. ఇళ్లలోకి విషపురుగులు వస్తున్నాయని.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయం అందించడంలో అధికారులు అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. జక్కంపూడిలో ఓ అధికారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎవరైనా పనిచేయకపోతే ఇలాగే వ్యవహరిస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంత్రులను కూడా వదిలేది లేదని అన్నారు.
బాధితులను అధికారులు తమ కుటుంబ సభ్యులుగా భావించాలని చంద్రబాబు సూచించారు. బాధ్యతగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందించడానికే అధికారులైనా, పాలకులైనా ఉన్నారని కానీ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ఆర్థిక సాయమైనా, నిత్యవసరాలైనా అందించాలని కోరారు. ఎవరి శక్తి మేర వారు సాయం అందించాలన్నారు. బాధితులకు ఎలా సాయం చేస్తారో మీరే ఆలోచించాలని సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ప్రజలు మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయమిది అని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం అందుతుందని తెలిపారు.