ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ..
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక, పేద అనే వ్యత్యాసాన్ని రూపుమాపేది ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా ఇతరులతో పాటు అభివృద్ధి బాటలో నడిపించేది విద్య మాత్రమే. అలాంటి విద్యాభ్యాసానికై పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ నేడు రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ జమ చేశారు. తాడేపల్లి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ని రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ లు సిపాయి సుబ్రమణ్యం, బల్లి కళ్యాణ చక్రవర్తి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డికె.బాలాజీ, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, శ్రీకాళహస్తి ఆర్డీవో రామారావు, పుష్పగుచ్చమందించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుండి చిత్తూరు జిల్లా నగరి పట్టణం కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు ఏపీ సీఎం వైయస్ జగన్ చేరుకున్నారు.
హెలి ప్యాడ్ వద్ద మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ సభా సమావేశానికి విచ్చేశారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్‌కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రారంభించారు. తద్వారా ఏప్రిల్ నుంచి జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చుతున్నారు. వారి ఫీజును పూర్తిగా రీయింబర్స్‌మెంట్ చేస్తున్నారు. ఇందుకోసం బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ మనీని ఫీజు-రీయింబర్స్‌మెంట్ కింద విద్యాసంస్థలు తీసుకుంటాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం ఇదేనని సీఎం జగన్ అన్నారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువుకి అడ్డం కాకూడదనే ఉద్దేశంతోనే జగనన్న విద్యా దీవెనను తెచ్చినట్లు ఆయన తెలిపారు.
100 శాతం పూర్తి ఫీజును ప్రతీ 3 నెలలకు ఓసారి రీయింబర్స్ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఫీజును ఇవాళ రిలీజ్ చేసినట్లు వివరించారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తల్లుల అకౌంట్లలోకి మనీ పంపిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.11,317 కోట్లను లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు టిడిపి అరాచకాలపై ఘాటుగా విమర్శిస్తూ అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారని 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడని మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశమని కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారని పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడని ఈ ఘటనలో పోలీస్ కన్ను కూడా పోగొట్టారని చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు.
ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకురావడం జరిగిందని ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకమని నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశామని 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నామని జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నామని అన్నారు. మంత్రిరోజా మాట్లాడుతూ పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే చెల్లుతుందని ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారని ఆమె అన్నారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని రోజా హర్షద్వనులతో గట్టిగా వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల చప్పట్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారని రోజా విమర్శించారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమం చేశారు.