కాకినాడ జిల్లా, యు కొత్తపల్లి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర జలాలలో చేపలవేట చేయు యాంత్రిక పడవలు అనగా మేకనైజడ్ మరియు మోటారు బోట్లు ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపల వేటను ఈనెల15 నుండి జూన్ 14 వరకు అనగా 61 రోజుల పాటు వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులను మత్స్య శాఖ జారీ చేసింది. సముద్ర జలాలలో చేపల వేట నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశ్యము వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి ఈకాలములో తల్లి చేపలు మరియు రొయ్యలను సంరక్షించడం, వాటిసంతతి పెరుగుదలను ప్రోత్సహించడము, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించడము దీని ముఖ్య ఉద్దేశమని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిషేధ ఉత్తర్వులను అనుసరించి, సముద్ర జలాలలో యాంత్రిక పడవలు (మేకనైజడ్ మరియు మోటారు బోట్ల) పై మత్స్య కారులు ఎటువంటి చేపలవేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించగలరని అధికారులు పేర్కొన్నారు.
నిషేధ ఉత్తర్వులను వుల్లంఘించి చేపల వేట చేసిన యెడల ఆయాబొట్లు యజమానులను ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టము (AP_MFR Act)1994, సెక్షన్ (4) ను అనుసరించి శిక్షార్హులు, అట్టి వారి బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరుచుకొనుటయే గాక, జరిమానా విధిస్తూ, డీజిల్ ఆయిల్ రాయితీ మరియు ప్రభుత్వం అందించే అన్నీ రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేయబడునని తెలిపారు .ఈ నిషిద్ద కాలమును ఖచ్చితముగా అమలు చేయుటకై మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ మరియు రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమైనది.
కావున మత్స్యకారులు అందరూ సహకరించవలసినదిగా మరియు ఈ వేటనిషేద కాలానికి రాష్ట్ర ప్రభుత్వము మత్స్యకార భరోసా పథకం క్రింద అందించే వేట నిషేధ భృతికి లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం ఈనెల 17 వ తేదీన ఎన్యూమరేషన్ (బోటు, బోటు యజమానులు మరియు కాలసీల వివరాల సేకరణ) జరుపబడును. ఆ సమయంలో బోటు యజమానులు వారితో పాటుగా బోటు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ నకలు మరియు వారి బోటులో పనిచేసే మత్స్యకారులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ నకళ్ళుతో హాజరుకావలసినదిగా జిల్లా మత్స్య శాఖ జిల్లా అధికారి కోరారు.