కాకినాడ, జనసేన ప్రతినిధి, జులై 14: మహాత్మా గాంధీ కలలుగన్న నిజమైన గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని.. వాలంటీర్లపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వారికి పూర్తిభరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం; సమాచార, పౌర సంబంధాలు; సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ ఛైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. వాలంటీర్ వ్యవస్థ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, ఇరిగేషన్ కార్యాచరణ, కౌలు రైతులకు రుణాలు, సీజనల్ వ్యాధుల కట్టడి, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖలకు సంబంధించి జెడ్పీటీసీలు తమ ప్రాంత అంశాలను లేవనెత్తగా అధికారులు వివరణ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలవుతున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని.. ఈ వ్యవస్థ ద్వారా అత్యంత సంతృప్తికర ఫలితాలు వస్తున్నాయని.. అయితే ఈ వ్యవస్థపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వీటిని ఖండించడంతో పాటు వాలంటీర్లకు మేమున్నామంటూ భరోసా కల్పించేలా, ఈ వ్యవస్థను తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపేలా తీర్మానం చేయాలంటూ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరగా.. దీనిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా దాదాపు రెండు కోట్ల మంది ప్రజలను కలిసి.. ప్రజల కష్టాలను గుర్తించి, పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చారని.. ఇవి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత ఒక్కటే ప్రాతిపదికగా పేదలకు పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నాయని.. కష్టమైన ఓ గొప్ప వ్యవస్థను తెచ్చి, విజయవంతం చేసి చూపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని.. వాలంటీర్లకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. తీర్మానానికి మద్దతుగా ఎంపీ వంగా గీత, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, శాసనసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడిన అనంతరం జెడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఈ తీర్మానాన్ని చారిత్రక తీర్మానం పేర్కొంటూ సమావేశంలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
వ్యవసాయం, ఇరిగేషన్‌పై కీలక చర్చ:
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. లోటు వర్షపాతం-ఖరీఫ్ ప్రారంభ పనులపై ప్రభావం, విత్తనాలు, ఎరువులు అందుబాటు, సాగునీటి కాలువల ద్వారా నీటి ప్రవాహం చిట్టచివరి వరకు చేరేందుకు చేపట్టాల్సిన పనులు, సీసీఆర్సీ కార్డులు, కౌలు రైతులకు రుణాలు, కాలువల్లో తూటి కాడ, గుర్రపుడెక్క తొలగింపు, డ్రైన్ల ఆధునికీకరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదైందని.. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో నారుమళ్లు కాకుండా నేరుగా వెదజల్లే పద్ధతిని అనుసరిస్తే బాగుంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. దీనిపై గ్రామసభలు పెట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మెట్టప్రాంతాల్లో రాగి వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు కూడా సరఫరా చేసినట్లు తెలిపారు. 10 వేల వరకు భూసార పరీక్షల నమూనాలు తీసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ జిల్లాలో కౌలురైతులకు గతేడాది 40 వేల సీసీఆర్సీ కార్డులు అందించామని.. ఈసారి ప్రతి ఒక్క కౌలు రైతుకు కార్డు అందించి, త్వరితగతిన రుణాలుమంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 36 వేల వరకు కార్డులు అందించినట్లు వెల్లడించారు. భూ యజమానులు దూర ప్రాంతంలో ఉంటే వీడియోకాల్ ద్వారా అంగీకారం తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. కౌలు రైతులను గుర్తించేందుకు వాలంటీర్, వీఏఏ ఇంటింటి సర్వే చేస్తున్నట్లు వివరించారు.
సీజనల్ వ్యాధులపై చర్చ:
డెంగీ నివారణ మాసోత్సవాలు (జులై 1-31) సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ కట్టడికి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, పారిశుద్ధ్య, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో ర్యాపిడ్ కిట్ల అందుబాటు తదితరాలపై చర్చించారు. కాకినాడ రూరల్, కోటనందూరు తదితర ప్రాంతాల్లో ఫైలేరియా కేసులు నమోదవుతున్నందున జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సర్వే చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వైద్య సేవలు పొందేందుకు పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రికార్డుస్థాయిలో ఈ నాలుగేళ్లలో దాదాపు 51 వేల మందిని నియమించినట్లు వివరించారు. వైద్య సేవలు అందించడంలో ఎక్కడా లోటుపాట్లు జరక్కుండా ఉండేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మ కార్యక్రమం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్లాంటేషన్ పనులపై చర్చించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావును మంత్రులు ప్రజాప్రతినిధులు సత్కరించారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ పరిపాలన అధికారి ఎం.బుజ్జిబాబు తదితరులు హాజరయ్యారు.