Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

పచ్చని పంట పొలాల మధ్యలో ఆక్వా చిచ్చ

పోతుకుర్రు గ్రామంలో యదేచ్చగా రొయ్యల చెరువుల త్రవ్వకాలు

అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన

జనసేన ప్రతినిధి,అయినవిల్లి, ఏప్రియల్ 9: అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో అక్రమ రొయ్యల చెరువులు తవ్వకాలు యదేచ్చగా జరుగుతున్నాయి. పచ్చని పంట పొలాలను తెల్లవారే సరికి రొయ్యలు చెరువులుగా మార్చేస్తున్నారు. పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వలన పక్కచేలు మోడుబారిపోయి పనికిరాకుండా పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను పట్టించుకునే నాధుడే లేరని రైతులు మండిపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రోక్లేయిన్ తో చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అయినవిల్లి మండలంలో ప్రతి గ్రామంలో ఆక్వా భూతం పచ్చని పంట పొలాలను నాశనం చేస్తుంది. కాసుల కక్కుర్తి తో అడ్డగోలుగా ఆక్వాచెరువులను త్రవ్వేస్తున్నారు. నివాస ప్రాంతాలను అనుకుని ఆక్వా చెరువులను త్రవ్వకూడదని ఉత్తర్వులు ఉన్నా యదేచ్చగా త్రవ్వేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.

ప్రజలు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో గుమ్మడి వారి పాలెం పరిధిలోని నివాస ప్రాంతాలను ఆనుకుని ఉన్న పంట పొలాల్లో రొయ్యల చెరువులు త్రవ్వకాలు ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 15 ఎకరాలలో ఆక్వా సాగు చేసేందుకు కొన్ని రోజులు క్రితం యంత్రాలతో,క్రేన్ లతో పనులు మొదలు పెట్టగా దళిత గ్రామాల ప్రజలు వ్యతిరేకించి అడ్డుకున్నారు. అయినా సరే మూడు రోజుల తర్వాత మళ్లీ చెరువులు త్రవ్వేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆక్వా చెరువుల వల్ల గ్రామంలో తాగునీటి ఇబ్బందులు వస్తాయని మంచినీరు కలుషితమై రోగాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పంట పొలాలను నాశనం చేసి అనారోగ్యం పాలు చేస్తే ఊరుకునేది లేదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో నివాస ప్రాంతాలకు 100 మరియు 200 మీటర్లు దూరంలోని చెరువుల త్రవేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో తాగునీటి బావులు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నివాస ప్రాంతాలకు ఆనుకుని తవ్వకాలు చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ప్రజలు తిరగబడుతున్నారు. అత్యంత వ్యవసాయ ప్రాంతమైన ఈ గ్రామంలో ఇక్కడ పంట కాలువల్లో కలుషిత జలాలు కలవడం వలన అన్ని పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతుల ఆందోళన చెందుతున్నారు.

అయినవిల్లి మండలం లో ప్రతి గ్రామంలోని రొయ్యల చెరువులు విచ్చలవిడిగా త్రవ్వేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. పంట భూముల్లో ఎటువంటి రొయ్యల చెరువులు తవ్వకూడదనే కచ్చితమైన నిబంధన ఉంది. ఒకవేళ తవ్వాల్సి వస్తే రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, మత్స్యశాఖ, పొల్యూషన్ శాఖ లాంటి 22 శాఖలు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏ అనుమతులు తీసుకుని రొయ్యల చెరువులు తవ్వుతున్నారు అనేది సంబంధిత అధికారులకే తెలియాలి. అయితే ఆ సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు అంటున్నారు. వీరికి రాజకీయ అండదండలు ఉన్నాయనే వార్తలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే కలుగజేసుకుని అక్రమ రొయ్యల చెరువులు త్రవ్వకాలు నిలిపివేసి తమ భూములకు, గ్రామానికి రక్షణ కల్పించాలని రైతుల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

Leave a Comment