Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు… కావలిలో అందజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

  నెల్లూరు-కావలి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నెల్లూరుజిల్లా కావలి పురపాలక సంఘం పరిధిలోని మద్దూరుపాడు వద్ద రూ.161.11 కోట్ల తో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను శుక్రవారం మంత్రి ఆదిమూలపు సురేష్. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ లతో కలసి ప్రారంభించి లబ్దిదారులకు అందచేసి, లబ్దిదారులచే గృహప్రవేశం చేయించారు.ఈ సంధర్బంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ, పేద వాని సొంతింటి కల సాకారం చేసుకునే దిశలో కావలి పురపాలక సంఘం పరిధిలోని మద్దూరుపాడు వద్ద 21 ఎకరాల్లో రూ.161.11 కోట్ల రూపాయలతో పి.ఎం.ఎ.వై. – జగనన్న నగర్ పధకం కింద ఏపి టిడ్కో ద్వారా జి+3 పద్దతిలో మూడు రకాల్లో మొదటి ఫేజ్ కింద నిర్మించిన 2,112 ఇళ్ళను ఈ రోజు లబ్దిదారులకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ళకు సంబంధించి ఒక లక్షా 40 వేల ఇళ్ళపై ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల భారం భరించి మహిళా లబ్ధిదారులకు అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఒక్కొక్కో ఇంటికి 2.65 లక్షల రూపాయల రుణాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించడం వలన నెలకు 3 వేల రూపాయల వంతున 20 సంవత్సరాలకు 7 లక్షల రూపాయలకు పైగా భారం లబ్దిదారులపై పడుచున్నదన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది గమనించి పేదలపై భారం పడటం మంచిది కాదని, ఆ రుణాన్ని ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు ఉచితంగా ఇస్తున్నదన్నారు. 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు కొలతలతో టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేపట్టగా, గతంలో 300 చదరపు అడుగులు ఇళ్ళకు లబ్దిదారులు 500 రూపాయలు చెల్లించాల్సి వుండగా, నేడు ఈ ఇళ్ళను రూ.1 కే ఇవ్వడంజరుగుచున్నదన్నారు.

అలాగే 365 చదరపు అడుగులు ఇళ్ళ లబ్దిదారులు 50 వేల రూపాయలు చెల్లించాల్సి వుండగా, నేడు 25 వేల రూపాయలకు తగ్గించడం జరిగిందని, అలాగే 430 చదరపు అడుగులు ఇళ్ళ లబ్దిదారులు లక్ష రూపాయలు చెల్లించాల్సి వుండగా, నేడు 50 వేల రూపాయలకు తగ్గించడం జరిగిందని, దీని వలన ప్రభుత్వానికి అదనంగా మరో 400 కోట్ల రూపాయలు భారం పడటం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఇళ్ళ రిజిస్ట్రేషన్ ఖర్చు గతంలో లబ్దిదారులే భరించాల్సి వుండగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఖర్చును భరిస్తూ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ప్రభుత్వానికి మరో 1200 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల టిడ్కో ఇళ్లు సంపూర్ణ మౌలిక సదుపాయాలతో పూర్తిచేసి లబ్దిదారులకు అందచేయడం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు. స్థానికి శాసన సభ్యుల కోరిక మేరకు ఈ టిడ్కో ఇళ్ళ సముదాయాలకు ప్రహరి గోడ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అలాగే కావలి పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి 45 కోట్ల రూపాయలు మంజూరు విషయమై ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నిధుల మంజురుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. కావలి పట్టణంలో మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపు గురించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ, సొంత ఇల్లు కలిగి ఉండటం సామాన్యులందరి కలని, ఆ కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 30 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రామాణికంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ 2 లక్షల 31 వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో జమచేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పేదరికం అడ్డురాకుడదని, పేదరిక నిర్మూలన చదువు ద్వారానే సాధ్యమౌతుందన్న లక్ష్యంతో అమ్మ ఒడి పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 15 వేల రూపాయలు అందచేయడం జరుగుచున్నదన్నారు.

శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇంటి పట్టాలతో పాటు ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టండం జరిగిందన్నారు.స్థానిక శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేద వారి సొంతింటి కల నెరవేర్చే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి 33 లక్షల ఇళ్ళ పట్టాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని, ఈ ప్రాంత మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ ను నిర్మించడం జరిగిందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మత్స్యకారులకు అంకితం చేయనున్నట్లు ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు.

కావలి పట్టణంలోని ముసునూరు వద్దగల జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణాలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. సంగం బ్యారేజి నుండి నేడు కావలి నియోజక వర్గానికి సంబంధించిన సాగునీరు, త్రాగు నీరు సంవృద్దిగా అందుతున్నాయన్నారు. కావలిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, కావలి పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, టిడ్కో సముదాయానికి ప్రహరి గోడ నిర్మాణం తదితర సమస్యలను ఈ సందర్భంగా శాసన సభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి, మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎపి టిడ్కో చైర్మన్ జమ్మా న ప్రసన్న కుమార్, డైరెక్టర్లు రాఘవ రావు, కె. నాగేశ్వరి, టిడ్కో సి ఈ గోపాల్ కృష్ణా రెడ్డి, ఎస్.ఈ జాన్ సైమన్ , ఈఈ ఉమాశంకర శాస్త్రి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆర్డీవో శీనా నాయక్, మెప్మా పిడి రవీంద్ర, కావలి నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టిడ్కో లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment